ఇసుక మాఫియాలో వైసీపీ నేత‌లు… లిస్ట్ పెద్ద‌దే…!

-

రాష్ట్రంలో గ‌డిచిన నాలుగు మాసాలుగా ఇసుక తుఫాను భారీ ఎత్తున విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. అదేం దుర‌దృష్ట‌మో.. చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా.. రాని వ‌ర్షాలు.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి దుమ్ముదులుపుతున్నాయి. ఇవి కావాల్సిన వాటి క‌న్నా భారీగా కుర‌వ‌డం, జీవ‌న‌దులైన కృష్ణా, గోదావ‌రులు పొంగి పొర్లుతుండ‌డం.. ఇసుక తుఫానుకు కార‌ణ‌మ‌నే వాద‌న ప్ర‌భుత్వం నుంచి వినిపిస్తోంది. అయితే,ఇసుక‌ను కావాల‌నే బ్లాక్ చేశారు. ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టిన సొమ్మును ఇసుక ద్వారా రాబ‌ట్టుకునేందుకు వైసీపీ నాయ‌కులు పెద్ద స్కెచ్ వేశార‌ని ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌లకు ముందు వ‌ర‌కు కూడా ఒక పార్టీపై మ‌రోపార్టీ దుమ్మెత్తి పోసుకున్నా.. ఇసుక విష‌యం వ‌చ్చే స‌రికి జెండాలు ప‌క్క‌న పెట్టి మ‌రీ ఒకే అజెండాతో దూసుకుపోయి.. వైసీపీని టార్గెట్ చేసి, జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుమ్మ‌రిస్తున్నాయి. అంతేకాదు, టీడీపీ నాయ‌కులు ఏకంగా మా హ‌యాంలో కాదు.. ఇసుక మాఫియా ఇప్పుడే అవ‌త‌రించింది.. అంటూ పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా ఇసుక మాఫియాలో భాగ‌మ‌య్యారంటూ.. కొంద‌రు వైసీపీ పేర్లు కూడా బ‌య‌ట‌కు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఈ విష‌యంలో కొంచెం దూకుడుగా మాజీ మంత్రి, టీడీపీ టెక్క‌లి ఎమ్మెల్యే అచ్చ‌న్నాయుడు వైసీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అనచరులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.వైసీపీ నేతలు, మంత్రుల దోపిడీ వల్లే ఇసుక కొరత వచ్చిందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోతోందని ఆయన చెప్పారు. అన్ని ఆధారాలతో చార్జీ షీట్ విడుదల చేస్తున్నామన్న‌ ఆయన ఏకంగా స్పీకర్ తమ్మినేని కుటుంబ సభ్యులతోపాటు, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ ఉన్నారు.

అలాగే మేకపాటి గౌతం రెడ్డి, బుగ్గన రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, తానేటి వనిత, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పార్థ సారధి, ఉదయభాను, కొడాలి నాని,తోపుదుర్తి, రోజా అనుచరులు, కుటుంబ సభ్యులకు ఇసుక మాఫియాలో సంబంధం ఉందని చార్జీషీట్ లో ఆరోపించారు. దీంతో ఈ ఇసుక తుఫాను మ‌రింత తీవ్ర రూపం ధ‌రించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. పైగా రేపు(ఈ నెల 14) చంద్ర‌బాబు ఇసుక దీక్ష చేస్తున్న నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయోన‌ని ఆస‌క్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news