కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరికొన్ని దేశాలకు విస్తరించింది. ఐరోపా దేశాలు బ్రిటన్, జర్మనీ, ఇటలీల్లో కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. నెదర్లాండ్స్‌లో 13 మంది, ఆస్ట్రేలియాలో ఇద్దరికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్ దేశాల్లో కూడా కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో చాలా దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.
ఆఫ్రికా దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, లెసోతో, ఏస్వటినా, బోట్స్‌వానాల నుంచి రాకపోకలపై నిషేధం విధించిన బ్రిటన్ తాజాగా అంగోలా, మాలావి, మొజాంబిక్, జాంబియాలను కూడా ఆ జాబితాలో చేర్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, కెనడా, జపాన్, ఇరాన్, థాయిలాండ్, సింగపూర్ తదితర దేశాలు ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరమైందన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.