ఏపీకి మరో ముప్పు : తీటా, ఎప్సెలా అనే కొత్త వెరియంట్స్ !

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ కోవిడ్ టెక్నికల్ కమిటీ ఛైర్మన్ డా. చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ రావటం ఖాయమని ఏపీ ప్రజలను హెచ్చరించారు. కొద్ది వారాల్లోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్న ఆయన.. ప్రపంచంలో అందరికీ వ్యాక్సిన్ వేసిన తర్వాతే వైరస్ తగ్గిందని చెప్పొచ్చని అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు తీటా, ఎప్సెలా అనే వెరియంట్స్ వస్తున్నాయని హెచ్చరించారు ఛైర్మన్ డా. చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ కనిపిస్తోందన్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. వ్యాప్తి ఎక్కువగా ఉన్నా థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తెలిపారు. 40 బెడ్లు ఉన్న ప్రతి హాస్పిటల్ కు ఆక్సిజన్ లైన్లు, ఏరియా హాస్పిటళ్ళలోనూ ఐసీయూ బెడ్ల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు డా. చంద్రశేఖర్ రెడ్డి. ప్రజలందరూ.. బౌతిక దూరం పాటించాల్సిందేనని తెలిపారు.