న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామాతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు షాక్ అయ్యాయి. ఎంతటి అనుకూల పరిస్థితులు ఎదురైనా ఏమాత్రం సంయమనం కోల్పోకుండా తమ దేశాన్ని ప్రగతివైపు నడించిన జెసిండా రాజీనామా చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాజీనామా వెనక కారణమేంటనే ఆలోచనలో పడిపోయారు.
కరోనా కల్లోలం, అత్యంత దారుణస్థాయిలో జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె పాటించిన సంయమనం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇలాంటి ఆమె..తన రాజీనామాకు ఇదే తగిన సమయమని వెల్లడించారు.
‘నేనొక మనిషిని. మనం చేయగలినంత కాలం చేస్తాం. తర్వాత సమయం వస్తుంది. ఇప్పుడు నా సమయం. ఒక దేశానికి నాయకత్వం వహించడం అనేది అత్యంత ఉన్నతమైంది. అయితే, అది అత్యంత సవాలుతో కూడుకున్న పని. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తిస్థాయిలో లేనప్పుడు కొనసాగలేం. మీరు నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తా..? కాదా..? అనేది తెలుసుకోవడం కూడా ఒక బాధ్యతే. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవలేమని భావించడం వల్ల నేను ఈ పదవిని వీడటం లేదు. ఎందుకంటే మనం విజయం సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను’ అంటూ జెసిండా లేబర్ పార్టీ సభ్యులతో మాట్లాడారు. తన రాజీనామా వెనక ఎలాంటి రహస్యం లేదని వ్యాఖ్యానించారు.