కొత్తగా పార్టీలో చేరే వారికి ఆ హామీ ఇవ్వడం కుదరదు: భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. దీంతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీగా జరుగుతున్నాయని సంచలన ప్రకటన చేశారు. దానికి తగ్గట్లే కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకుని, ఆయా స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశించి పార్టీలో చేరుతున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే పార్టీలో చేరిన వారికి రేవంత్ రెడ్డి నుంచి టికెట్ విషయంలో స్పష్టమైన హామీతోనే పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క

ఈ విషయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఖమ్మం జిల్లాలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, భావాజాలన్ని నమ్మి, కాంగ్రెస్ పార్టీ వ్యాప్తికి కృషి చేసే వారందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటామన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరే వారికి అసెంబ్లీ టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.