ఏపీ లో అసెంబ్లీ లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు పరువు నిలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు. పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్‌కళ్యాణ్ స్వయంగా భీమవరం గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసినా పవన్ ఓడిపోక తప్పలేదు. ఇక పవన్ సోదరుడు నాగబాబు సైతం నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. పవన్‌ను నమ్ముకుని ఇతర పార్టీల నుంచి జనసేనలోకి వెళ్లి పోటీ చేసిన ఎంతోమంది సీనియర్లు సైతం ఓడిపోయారు.
అయితే తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన గెలిచింది. ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే జనసేన పరువు నిలబడింది. రాష్ట్రంలో ఎక్కడా గెలవలేకపోయిన జనసేన రాజోలులో మాత్రం విజయం సాధించింది. అక్కడ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆయన కూడా పార్టీ వీడతారన్న ప్రచారం జరుగుతోంది. రాపక అసెంబ్లీలో జగన్ పాలనను నిర్మొహమాటంగా ప్రశంసించారు.
ఇదిలా ఉంటే జనసేనలో రాపాకకు అవమానాలు ఎదురువుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. గెలిచిన రాపాకను కాదని. పవన్ కీలక కమిటీల్లో ఓడిపోయిన వాళ్లకు, ప్రజల్లో బలం లేని వాళ్లను నియమించడంతో రాపాక సైతం పవన్‌పై అసంతృప్తితోనే ఉన్నారు. ఇక ఇప్పుడు రాజోలు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేనను గెలిపించిన కీలక నేతలు అందరూ వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు వైసీపీలో చేరిపోయారు.
అలాగే ఎన్నికల సమయంలో జనసేన కోసం పని చేసిన నేతలు కూడా ఇప్పుడు అక్కడ వైసీపీ తరపున చూస్తున్నారు. రాజోలు నియోజకవర్గానికి చెందిన కేఎస్ ఎన్ రాజు అనే జనసేన నేత సైతం నేరుగా సీఎం జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఇక అక్కడ జనసేన గెలుపు కోసం పనిచేసిన క్షత్రియ, కాపు వర్గాలకు చెందిన కీలక నేతలతో పాటు ఆ నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి బలమైన లీడర్లుగా ఉన్న వారు సైతం ఇప్పుడు వైసీపీ బాటే పడుతున్నారు.
ఈ క్రమంలోనే జగన్ ఓకే చెప్పాలే కాని అక్కడ గెలిచిన రాపాక వరప్రసాద్ సైతం ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారు. రాపాక కూడా పార్టీ మారిపోతే అప్పుడు జనసేనకు ఆ ఒక్క సీటు కూడా ఉండదు. మరి పవన్ రాపాకను ఎలా దారిలోకి తెచ్చుకుంటారు ? పార్టీ గెలిచిన సింగిల్ సీటు రాజోలును ఎలా కాపాడుకుంటారో ? చూడాలి.