కూరగాయల ధరలు కొండెక్కాయి. ఏది కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి. ఇప్పటికే వానలకు పంటలు దెబ్బతిని తక్కువ కూరగాయలే మార్కెట్‌కు వస్తుంటే.. ఇప్పుడు ఆర్టీసీ సమ్మెతో వస్తున్న ఆ కాస్త కూరగాయలు కూడా పిరమయ్యాయి. సామాన్యుడు బ్రతకడం కష్టమైన ఈ రోజుల్లో ఇలాంటి సమ్మెలు ఎంత వరకు సబబు అన్నది ప్రజలకు అర్ధం కావడం లేదు. పది రోజుల్లోనే ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం టమాట, ఉల్లి, పచ్చి మిర్చి కిలో రూ.40 నుంచి రూ.50 వరకు.. ఆలు, వంకాయ, బెండ, బీర, కాకర రూ.50 నుంచి రూ.60 వరకు ధర పలుకుతున్నాయి. క్యారెట్ రూ.60, క్యాప్సికమ్ రూ.65కు వస్తుండగా.. బీన్స్, చిక్కుడుకాయలైతే రూ.80కి చేరాయి. ఇంకో నెల రోజులు దిగుబడి పరిస్థితి ఇట్లే ఉండొచ్చని రైతులు చెబుతున్నారు.
ఈ విధంగా రేట్లు మండిపోతుంటే కొనేవాడి కష్టం వర్ణనాతీతంగా ఉంది. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు రాష్ట్రంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఒక వైపు, ఆర్టీసీ సమ్మె మరోవైపు దీంతో సామాన్యులకే కాదు మధ్య తరగతి వారిని సైతం బెంబేలెత్తిస్తున్నాయి కూరగాయల ధరలు. ఎన్నడూ లేని విధంగా ఆకుకూర ధర మాత్రం కిలోకు వంద రూపాయలకి వెళ్లిన నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు చేయాలంటే బెంబేలెత్తుతున్నారు.
ఆర్టీసీ సమ్మె కారణంగా ఆటోలు కూడా ప్యాసింజర్ ఫీజు నేపథ్యంలో కొంతవరకు రవాణాపైనే ప్రభావం చూపి కూరగాయల ధరల పై ప్రభావం పడి ఎనభై, వందకు అమ్ముతున్నారు. ఆర్టీసి సమ్మె కారణంగా కూరగాయలను తరలించేందుకు రైతులు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఏదైన సమ్మె జరిగితే నిత్యావసరాల ధరలకూ రెక్కలొస్తాయి.
ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు ఇలాంటి సమ్మేలకు సామాన్యులే బలవుతారు. మొదటి రోజు ఆర్టీసీ చేస్తున్న సమ్మె కారణంగా ఆటోలు ఒక్కరోజూ రెండ్రోజులు ఉపయోగిస్తారు కానీ ఎక్కువగా పది పదిహేను రోజుల వరకూ ఇది కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కూరగాయల రేట్లు పెంచాల్సిన అవసరమైతే వస్తుంది అని చెప్పి రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం మెహిదీపట్నం మార్కెట్ దగ్గర ఉన్న పరిస్థితి, ఇక్కడ రంగారెడ్డి జిల్లా అలాగే మేడ్చల్ నుంచి అనేక మంది రైతులు తాము పండించిన కూరగాయాల్ని తీసుకువస్తూ ఉంటారు. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు తాము పండించిన కూరగాయలను అమ్ముతూ ఉంటాము. కానీ రాను రాను ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు