సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ భారత్‌లోని తన గూగుల్ పే యూజర్లకు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తుంది. ఇకపై గూగుల్ పే యూజర్లు తమ ఎన్ఎఫ్‌సీ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను గూగుల్ పేలో యాడ్ చేసి వాటి ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటికే ఏడాది నుంచి గూగుల్ ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. అందులో భాగంగానే త్వరలో ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీంతో కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన పనిలేకుండా గూగుల్ పే ద్వారానే వాటితో చెల్లింపులు చేయవచ్చు.
గూగుల్ పే లో ఎన్ఎఫ్‌సీ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే…
* ఫోన్ లోని గూగుల్ పే యాప్‌ను ఓపెన్ చేయాలి. అందులో సెట్టింగ్స్ లో ఉండే పేమెంట్ మెథడ్స్ లోకి వెళ్లి యాడ్ కార్డ్‌ను ప్రెస్ చేయాలి.
* కార్డు నంబర్, ఎక్స్‌పైరీ తేదీ, సీవీవీ నంబర్, పేరు, బిల్లింగ్ అడ్రస్ ఎంటర్ చేయాలి.
* సేవ్ బటన్‌పై ప్రెస్ చేయాలి.
* టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను యాక్సెప్ట్ చేయాలి.
* కార్డు బ్యాంకును గూగుల్ కాంటాక్ట్ చేసి కార్డు మీదో, కాదో వెరిఫై చేస్తుంది. అందుకు ఓటీపీ ద్వారా వెరిఫికేషన్‌ను ఎంచుకోవచ్చు.
* ఫోన్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి కన్‌ఫాం చేయాలి.
* లిస్ట్‌లో ఉండే కార్డును పేమెంట్ మెథడ్‌గా ఎంచుకుని యాక్టివేట్ అనే బటన్‌పై ప్రెస్ చేయాలి.
* గూగుల్ పే అకౌంట్ వన్ టైం పాస్‌వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మళ్లీ ఓటీపీ కన్ఫాం చేయాలి. దీంతో యూజర్ యాడ్ చేసే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు గూగుల్ పే అకౌంట్‌లో యాడ్ అవుతుంది.
తరువాత ఆ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన పనిలేకుండానే గూగుల్ పే ద్వారా ఎక్కడైనా చెల్లింపులు చేయవచ్చు. అయితే ఇందుకు గాను ఫోన్‌లో ఎన్ఎఫ్‌సీ ఫీచర్ ఉండాలి. ప్రస్తుతం చాలా వరకు ఫోన్లలో ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఇబ్బంది ఉండదు. ఇక బిల్లు చెల్లించే మెషిన్‌కు ఎన్ఎఫ్‌సీ సదుపాయం ఉండాలి. లేదా క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా కూడా బిల్లు చెల్లించవచ్చు. ఇలా గూగుల్ పేలో ఎన్ఎఫ్‌సీ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశను ముగించుకున్నందున త్వరలోనే యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.