దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో 60 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. రెండు పేలుళ్ల కేసులకు సంబంధించి ఏకకాలంలో 60 చోట్ల తనిఖీలు చేపట్టింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు ఇవాళ తెల్లవారుజామున ఎన్‌ఐఏ అధికారులు చేరుకొన్నారు.
గతేడాది అక్టోబర్‌లో తమిళనాడులోని కోయంబత్తూరు, నవంబర్‌లో కర్ణాటకలోని మంగళూరులో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి కీలక ఆధారాల కోసం సోదాలు చేపట్టారు. వీటిల్లో కొండుంగయూర్(తమిళనాడు), మన్నాడి (కేరళ) కూడా ఉన్నాయి.
గతేడాది అక్టోబర్ 23వ తేదీన కోయంబత్తూరులోని కట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనపై అదే నెల 27న ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఈ కేసులో 11 మంది నిందితులను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
మరోవైపు గత నవంబర్‌లో మంగళూరులోని ఓ ఆటోరిక్షాలో కుక్కర్ బాంబు పేలింది. దీనిపై డిసెంబర్‌లో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. మహమ్మద్ సారిక్ అనే వ్యక్తి బాంబును తీసుకెళుతున్నట్లు గుర్తించారు. మత ఘర్షణలను రెచ్చగొట్టడానికి ఈ బాంబును తీసుకెళుతున్నట్లు భావిస్తున్నారు. అతడికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.