ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్ కుమార్ నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.
సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం తో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషనర్ గా తొలగుంచింది. అయితే న్యాయస్థానాలను ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎట్టకేలకు మళ్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వహించ నున్నారు.