బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రాకు నో జీఎస్టీ : నిర్మలా సీతారామన్‌

-

బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు. ప్రింటర్‌ నుంచి బ్యాంకులు కొనుగోలు చేసే చెక్‌బుక్‌లపైనే జీఎస్టీ ఉంటుందన్న ఆమె.. వినియోగదారుల చెక్‌బుక్‌లపై పన్ను ఉండదన్నారు. దేశంలో ధరల పెరుగుదల అంశంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె సమాధానం ఇచ్చారు.

ముందుగా ప్యాక్‌ చేసి లేబుల్‌ వేసిన ఆహార పదార్థాలపై 5శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయని.. ఆ ప్రతిపాదనకు ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ఆస్పత్రి పడకలు/ఐసీయూలకు జీఎస్టీ లేదన్న ఆమె.. రోజుకు రూ.5000 అద్దె చెల్లించే గదులకు మాత్రమే జీఎస్టీ విధించినట్టు తెలిపారు.

పేదలు వినియోగించే ఏ వస్తువు పైనా పన్ను విధించలేదన్న నిర్మలా సీతారామన్‌.. ముందుగా ప్యాక్‌ చేసి లేబుల్‌ వేసిన వస్తువులపైనే 5శాతం జీఎస్టీ విధిస్తున్నాం తప్ప విడిగా విక్రయిస్తే ఎలాంటి పన్నూ ఉండదని తెలిపారు. ప్రతీ రాష్ట్రం తృణధాన్యాలు, పప్పులు, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి కొన్ని ఆహార పదార్థాలపై పన్ను విధించాయంటూ ఆహార పదార్థాలపైనా తాజాగా కేంద్రం జీఎస్టీ విధించడాన్ని సమర్థించుకున్నారు.

శ్మశానవాటికలకు జీఎస్టీ లేదని.. కొత్త శ్మశానవాటికల నిర్మాణంపై మాత్రం పన్ను ఉంటుందని స్పష్టంచేశారు. ఇతర దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పోల్చుతూ ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్లే భారత్‌లో ద్రవ్యోల్బణం రేటు 7శాతంగా ఉందన్నారు. ధరల పెరిగాయన్నది ఎవరూ కాదనలేని అంశమని.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్రం తన వంతు కృషిచేస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news