ఓ వర్గానికి చెందిన పేద కుటుంబాల్లోని చురుకైన యువకుల్ని ఎంపిక చేసుకోవడం.. ఇతర వర్గాలపై విద్వేష భావజాలాన్ని నూరిపోయడం..రాళ్లు విసరడంలో సిద్ధహస్తుల్ని చేయడం..మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చి వారిని మానవ మిస్సైళ్లుగా మార్చడం. అవసరమైనప్పుడు సంఘ విద్రోహ చర్యల దిశగా వారిని ఉసిగొల్పి దేశాన్ని అస్థిరపరచడం. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) ముసుగులో కొందరు ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో ఇప్పటికే నిజామాబాద్ వాసులు అబ్దుల్‌ఖాదర్, మహ్మద్ ఇమ్రాన్, షేక్‌షాదుల్లా, మహ్మద్ అబ్దుల్ మొబిన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..పరారీలోఉన్న మరో 24మందిని నిందితులుగా చేర్చారు. అరెస్టయిన నిందితుల రిమాండ్ డైరీలో పోలీసులు ఎన్నో విస్మయకర అంశాలను పొందుపరిచారు.
ఆ డైరీలోని వివరాల మేరకు.. ‘‘తొలుత స్వచ్ఛంద, ధార్మిక సంస్థల కార్యకలాపాల ముసుగులో విరాళాలు సేకరిస్తూ, ఆ సొమ్మును సేవా కార్యక్రమాల ద్వారా పంచి పెడుతూ ఓ వర్గం ప్రజల మన్ననలు పొందడంపైనే పీఎఫ్‌ఐ దృష్టి సారించింది. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల యువత సులభంగా తమ గాలానికి చిక్కుతారనే భావన ఆ గ్రూపులో ఉంది. ఆ గ్రూపు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సమావేశాలు నిర్వహించింది. భైంసా, బోధన్, జగిత్యాల, హైదరాబాద్ కర్నూలు, నంద్యాల, నెల్లూరులతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ సమావేశాలు జరిగాయి. వైరి వర్గం ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు వీలుగా గ్రూపు తరఫున 15 అనుబంధ విభాగాలు కూడా పనిచేస్తున్నాయి.” అని డైరీలో రాసుంది.
“గ్రూపు కార్యకలాపాల్లో కీలకమైన మార్షల్‌ఆర్ట్స్ శిక్షణ ఇచ్చే బాధ్యతను నిందితుల్లో ఒకరైన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ తీసుకున్నాడు. జగిత్యాలకు చెందిన ఖాదర్ కొంతకాలంగా నిజామాబాద్ ఆటోనగర్‌లో ఉంటున్నాడు. కుంగ్‌ఫూ శిక్షకుడిగా ఉన్న అతడి ఇంటి ఫస్ట్‌ఫ్లోర్‌లో ప్రత్యేకంగా గదిని నిర్మించేందుకు రూ.6 లక్షలు పీఎఫ్‌ఐ సమకూర్చింది. ఆర్నెల్లుగా అదే గదిలో అతను 200 మంది గ్రూపు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చాడు. గ్రూపు కార్యకలాపాల విస్తరణ కోసం సేకరించిన విరాళాల సొమ్మును కేసుల్లో చిక్కుకునే కార్యకర్తలకు న్యాయ సహాయం చేసేందుకు, ఓ జాతీయ పార్టీ, దాని అనుబంధ సంస్థలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు వినియోగిస్తున్నారు. తమ గ్రూపు గురించి ప్రచారం చేసేందుకు వీరంతా విద్యాసంస్థలు, ప్రార్థనాలయాలను అనువైన ప్రాంతాలుగా ఎంచుకుంటున్నారు. క్రమం తప్పకుండా డివిజన్, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ చేరికలకు (రిక్రూట్‌మెంట్లకు) పాల్పడుతున్నారు’’ అని డైరీలో పేర్కొన్నారు.
”పరారీలో ఉన్న నిందితుడు ఇలియాస్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న హ్యాండ్‌బుక్‌లో కీలక సమాచారం లభ్యమైనట్టు పోలీసులు రిమాండ్ డైరీలో నమోదుచేశారు. ‘‘కార్యకర్తలకు మార్షల్ ఆర్ట్స్‌తోపాటు రాళ్లు రువ్వడంలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఇతరమతాల శాంతియుత ర్యాలీల సందర్భంగా విధ్వంసం సృష్టించాలనేది వీరి కుట్ర. ర్యాలీలో ఉన్న వారి తలకు తగిలేలా రాళ్లను విసరడం ద్వారా ప్రాణనష్టం ఎక్కువగా ఉండాలనేది పన్నాగం. ఇలాంటి దుశ్చర్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనేది కుట్రలో భాగమని’’ విశ్లేషించారు.