పార్టీ దూకుడుగా లేదు. పైగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేక భావన నెలకొంది. ఈ సమయంలో బీజేపీ వంటి కీలకమైన జాతీయ పార్టీని రాష్ట్రంలో అభివృద్ధి చేయడం పెద్ద సవాలే. ఇది నాణేనికి ఒకవైపు. ఇక, ఇప్పుడు బీజేపీ ఏపీ పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజువ్యవహారశైలితో సరిపడని వారు పార్టీలో ఆయన పక్కనే ఉంటారు. ఇలాంటి సమయంలో ఆయన వారిని కలుపుకొని ముందుకు సాగడం కత్తిమీద సాములాంటిదే. ఇది నాణేనికి రెండోవైపు. మరి ఈ సమయంలో ఇలాంటి పరిస్థితులను సమన్వయం చేసుకుని పార్టీ ఎలా ముందుకు పరుగులు పెడుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది.
కేంద్రం నుంచి ఏపీకి విభజన హామీల రూపంలో కొన్ని వేల కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఇక, విభజన తర్వాత ఏపీకి ఇస్తామని చెప్పిన హోదా విషయంలో బీజేపీ పెద్దలు ఎప్పుడో మాట తప్పారు. దీనిపై ఇప్పటికీ.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌పై ఎంత కోపం ఉందో.. అంతే సమానంగా బీజేపీపైనా ఏపీ ప్రజలకు కోపం ఉంది. ఈ పరిణామమే గత ఏడాది ఎన్నికల్లో బాహాటంగా కనిపించింది. పైకి ఎన్ని లెక్కలు చెప్పినా.. ఏపీ రాజకీయాల్లో బీజేపీ పుంజుకోవడం అనేది ఇప్పట్లో జరిగేది కాదనే విషయం ఆ పార్టీ నేతలకు కూడా తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీని పరుగులు పెట్టించే పరిస్థితి సోము కు ఉంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇక, సోము వ్యక్తిగత రాజకీయాలకు వస్తే.. వాస్తవానికి ఆయనది కాపు సామాజిక వర్గమే అయినప్పటికీ.. తూర్పుగోదావరికి చెందిన నాయకుడే అయినప్పటికీ.. ముక్కసూటి తనం, కరుకైన విమర్శల కారణంగా.. ఇటు సొంత పార్టీలోను, అటు కాపువర్గంలోనూ పెద్దగా జోరందుకోలేదనేది వాస్తవం. కేవలంఆర్ ఎస్ ఎస్ ముద్ర ఒక్కటే సోముకు కలిసివచ్చింది. కాపులను సామాజికపరంగా బీజేపీకి చేరువ చేయడంలో కన్నా చేసిన ప్రయత్నాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ..వారు బీజేపీకి చేరువ కాలేక పోయారు. ఇక, బీజేపీ సభ్యత్వాన్ని రాష్ట్రంలో పరుగులు పెట్టిస్తానని, ప్రతి ఇంటిపైనా బీజేపీ జెండా ఎగిరేలా చేస్తానని చెప్పిన కన్నా ఈ విషయంలోనూ విఫలమయ్యారు.
అదేసమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలోనూ కన్నా ఫెయిలయ్యారు. మాజీ మంత్రిగా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కన్నాకు ఉన్న అనుభవంతో పోలిస్తే.. సోము వీర్రాజుకు ఉన్న అనుభవం డిఫరెంట్. ఒకరకంగా.. కన్నాపై చంద్రబాబుకు దోస్తీ అనే ముద్ర ఎలా పడిందో జగన్‌కు దోస్తీ.. అనే ముద్ర వీర్రాజుపై కూడా ఉంది. అనేక సందర్భాల్లో జగన్ నిర్ణయాన్ని సోము సమర్ధించారు. మూడు రాజధానులపై తొలిగా స్పందించి సమర్ధించింది సోము మాత్రమే. అదేవిధంగా ఇంగ్లీషు మీడియం విషయాన్ని అర్ధం చేసుకోకుండా రాజకీయం చేస్తున్నారని వాదించింది కూడా సోము. ఈ పరిణామాలను గమనిస్తే.. వ్యక్తులు మారారే తప్ప.. బీజేపీ మారుతుందనే అవకాశం.. ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.