బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తనున్నట్లు సమాచారం. ప్రస్తుత ప్రధాని లిజ్ ట్రస్‌ను పదవి నుంచి దించేందుకు శరవేగంగా సన్నహాలు జరుగుతున్నట్లు ఆ దేశ వార్తా పత్రికల్లో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన దాదాపు 100 మంది పార్లమెంట్ సభ్యులు ట్రస్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం సమర్పించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అక్టోబరు 24లోగా ఆమెకు ఉద్వాసన పలికే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల కమిటీ హెడ్ గ్రాహమ్ బ్రాడీకి.. ఎంపీలు తమ అవిశ్వాస పత్రాలను సమర్పించనున్నట్లు డెయిలీ మెయిల్ పత్రిక వెల్లడించింది. ట్రస్ సమయం ముగిసిందని, అవిశ్వాస తీర్మానంపై తక్షణమే ఓటింగ్ నిర్వహించేందుకు వీలుగా నిబంధనలు మార్చేలా ఆదేశాలివ్వాలని ఎంపీలు కోరనున్నట్లు సమాచారం.
అయితే ఇందుకు బ్రాడీ విముఖత వ్యక్తం చేసినట్లు సదరు పత్రిక పేర్కొంది. అక్టోబరు 31న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మరో ఆర్థిక వ్యూహాన్ని ప్రకటించేలా ట్రస్, ఆర్థిక మంత్రి హంట్‌కు మరో అవకాశం ఇవ్వాలని బ్రాడీ ఎంపీలను సూచించినట్లు ఆ కథనం వెల్లడించింది. మరి దీనిపై ఎంపీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఆమెను తొలగించి ప్రధానిగా రిషి సునాక్‌ను తెరపైకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు బహిర్గతమైంది. అదే జరిగితే.. 2016లో ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగిన తర్వాత ప్రధాని అర్ధంతరంగా పదవి నుంచి దిగిపోవడం ఇది మూడోసారి కానుంది.