99 శాతం హామీలు అమలు చేసిన తమ ముందు 10% హామీలు కూడా అమలు చేయని చంద్రబాబు నిలబడగలరా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు.మదనపల్లి సభలో మాట్లాడుతూ.. ‘అధికారం కోసం తోడేళ్లన్నీ కలిసి వస్తున్నాయి. నన్ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, బీజేపీ, కాంగ్రెస్ ఏకమయ్యాయి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఎవరికీ లేదు.మేము మంచి చేయకపోతే ఇంతమంది కలిసి వస్తారా? అని ప్రశ్నించారు. విపక్షాల పొత్తులకు మేం భయపడటం లేదు’ అని తెలిపారు.
చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమూ గుర్తుకు రాదని ముఖ్యమంత్రి జగన్ ఎద్దేవా చేశారు. జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తాయని తెలిపారు. ‘జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ గుర్తొస్తాయి. లంచాలు లేని పాలన అంటే గుర్తొచ్చేది జగన్ అని అన్నారు. వివిధ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేశాం అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఎక్కువ లబ్ధి చేకూర్చాం’ అని అన్నారు.