నేటి ఆధునిక కాలంలో మనం ఎక్కువగా ఏసీ గదుల్లోనో లేదా ఆఫీసుల్లోనో బందీ అయిపోతున్నాం. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సూర్యకాంతి మనపై పడటమే గగనమైపోయింది. అయితే సూర్యరశ్మి తగలకపోవడం కేవలం చర్మం రంగు మారడం మాత్రమే కాదు, అది మన మొత్తం ఆరోగ్య వ్యవస్థనే తలకిందులు చేస్తుందని మీకు తెలుసా? ఎముకల పటుత్వం నుండి మానసిక ఉల్లాసం వరకు సూర్యకాంతి మన శరీరానికి ఎలా ఒక ‘న్యాచురల్ బూస్టర్’లా పనిచేస్తుందో తెలుసుకుందాం..
సూర్యకాంతి మన శరీరానికి అందకపోతే కలిగే ప్రధాన నష్టం ‘విటమిన్ డి’ లోపం. దీనిని ‘సన్షైన్ విటమిన్’ అని పిలుస్తారు ఎందుకంటే మన చర్మంపై ఎండ పడినప్పుడే శరీరం దీనిని తయారు చేసుకోగలదు. విటమిన్ డి లేకపోతే మనం ఎంత క్యాల్షియం తిన్నా అది ఎముకలకు పట్టదు దీనివల్ల కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు వస్తాయి. కేవలం ఎముకలే కాదు మన రోగనిరోధక శక్తి కూడా సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటుంది. ఎండ తగలని వారిలో తరచూ జలుబు ఇన్ఫెక్షన్లు రావడం మరియు గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

శారీరక ఆరోగ్యమే కాదు, మన మానసిక స్థితిని మార్చడంలో కూడా సూర్యుడికి కీలక పాత్ర ఉంది. సూర్యకాంతి తగిలినప్పుడు మన మెదడులో ‘సెరోటోనిన్’ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది, ఇది మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. వెలుతురు లేని చోట ఎక్కువ సేపు ఉండటం వల్ల మానసిక ఆందోళన, నిరాశ (Depression) వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే, మన నిద్రను నియంత్రించే ‘మెలటోనిన్’ హార్మోన్ కూడా సూర్యకాంతి ప్రభావంతోనే క్రమబద్ధీకరించబడుతుంది. అంటే పగలు ఎండలో కాసేపు గడిపితేనే రాత్రిపూట గాఢ నిద్ర పడుతుంది. అందుకే ప్రతిరోజూ కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు లేత ఎండలో గడపడం మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష.
గమనిక: సూర్యకాంతి ఆరోగ్యం ఇస్తుంది కదా అని మధ్యాహ్నం వేళ తీవ్రమైన ఎండలో తిరగకూడదు. ఉదయం 7 నుండి 9 గంటల లోపు లేదా సాయంత్రం వేళ వచ్చే లేత ఎండ మాత్రమే శరీరానికి శ్రేయస్కరం. చర్మ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
