పసుపు బోర్డు పెట్టేది లేదు : కేంద్రం

-

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు పెట్టేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది వరకే ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాల బోర్డు (స్పైసెస్) రీజనల్ కార్యాలయంతోనే పనులు సరిబెట్టుకోవాలని తెలిపింది. దేశంలోనే అత్యధికంగా పసుపు పండిస్తున్న తెలంగాణ రైతులకు తీరని లోటు జరిగిందని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన ఎంపీ ధర్మపురి అర్వింద్ మాటలు హామీలకే పరిమితమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో పసుపు బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం పంపించారు.

పసుపు
పసుపు

ఆ లేఖలో.. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేసినట్లు ఎంపీ సురేశ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే పసుపు, హార్టికల్చర్ సాగుకు కేంద్రం సాయం చేస్తుందని, అనేక పథకాలు కూడా అమలు పరుస్తుందని పేర్కొంది. కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే నిజామాబాద్‌లో స్పైసెస్ బోర్డు రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, మళ్లీ పసుపు బోర్డును ఏర్పాటు చేయబోమన్నారు. కాగా, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, జగిత్యాల, ఆర్మూల్, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 80 వేల ఎకరాల్లో పసుపు పంట సాగు చేస్తున్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని, నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని 35 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు.

2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేత ధర్మపురి అర్వింద్.. తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని చెప్పడంతో రైతులు ఆయనను గెలిపించారు. ఒకవేళ పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ కూడా రాయించుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేయబోమని తెలుపడంతో ఎంపీ అర్వింద్‌పై నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు మండి పడుతున్నారు. వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news