వైసీపీలో మళ్లీ సందడి.. వాళ్లిద్దరికే ఆ పోస్టులు?

అమరావతి: వైసీపీలో మరోసారి సందడి వాతావరణం నెలకొంది. ఇటీవలే 4 ఎమ్మెల్సీలను భర్తీ చేసిన అధినేత.. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు పెంచినట్లు తెలుస్తోంది. త్వరలో టీటీడీ పాలక మండలిలో నామినేట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. దీంతో ఈ పోస్టులకు అశావహులు క్యూ కట్టారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న నేతలు కూడా జగన్ కార్యాలయం బాట పడుతున్నారట. జగన్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట.

ఈ లిస్టులో ముఖ్యంగా భూమన కుమారుడు అభినయరెడ్డి ముందున్నట్లు తెలుస్తోంది. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యేగా భూమన రెండుసార్లు గెలిచారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన ఆయనకు గత కేబినెట్‌లోనే చోటు దక్కుతుందని అనుకున్నారంతా. కానీ జగన్ నిరాశ పర్చడంతో తన కుమారుడు అభినయరెడ్డికైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరుతున్నారట. ఇప్పటికే సీఎం జగన్‌ను కలిసి అభినయరెడ్డి గురించి వివరించారట.

మరోవైపు పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఆసక్తిగా ఉన్నారట. తనకు కూడా నామినేటెడ్ పదవి కావాలని కోరుతున్నారట. ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు పెద్దగా గుర్తింపు లేదనే అసంతృప్తిలో ఉన్నారట. కనీసం ఈ పదవి ఇచ్చైనా గౌరవించాలని అంటున్నారట. ఇక జగన్‌ను కలవటమే తరువాయి భాగమట. త్వరలో కలుస్తారని ప్రచారం జరుగుతోంది. మరి వీరిద్దరి అభ్యర్థనను జగన్ పట్టించుకుంటారా?.. మరెవరికైనా అవకాశం ఇస్తారో చూడాలి.