కిమ్‌ క్రేజీ ఆదేశం.. దేశంలో తన కుమార్తె పేరు ఎవరికీ ఉండొద్దట..!

-

కొన్నిసార్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్‌ చేసే ఆదేశాలు చాలా వింతగా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన ఓ ఆదేశం కూడా ఇలాంటి కోవకే చెందుతుంది. కిమ్ పదేళ్ల కుమార్తె ‘జు-యే’నే కిమ్‌ వారసురాలనే వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆమెను పదేపదే మీడియా ముందుకు తీసుకువస్తుండటం  ఈ వాదనలకు బలం చేకూర్చుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా దేశవ్యాప్తంగా ‘జు-యే’ పేరు ఉన్నవారంతా తమ పేరును మార్చుకోవాలని అధికారులు బలవంతం చేస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కిమ్‌ కుమార్తెకు అదే పేరు ఉన్న నేపథ్యంలో.. పౌరులు ఆ పేరును వాడటాన్ని నిషేధించేందుకు అధికారులు ఈ మేరకు అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

దీంతో స్థానిక అధికారులు ‘జు-యే’ పేరుగల మహిళల కోసం జల్లెడ పడుతున్నారని, పేరు మార్చుకోవాలంటూ వారిపై ఒత్తిడి తెస్తున్నారని ‘రేడియో ఫ్రీ ఏషియా’ వార్తాసంస్థ తెలిపింది. ఉత్తర ప్యోంగాన్‌ ప్రావిన్స్‌లోని చోంగ్జు భద్రతా విభాగం.. ఆ పేరు ఉన్నవారిని పిలిపించి, వారి పేర్లను మార్చుకోవాలని ఆదేశించినట్లు పేర్కొంది. దక్షిణ ప్యోంగాన్ ప్రావిన్స్‌లోని ప్యోంగ్‌సాంగ్ అధికారులు సైతం ఇదే విధంగా సూచించినట్లు వెల్లడించింది. తమ నాయకులను గౌరవించేలా.. వారి పేర్లను ప్రజలు ఉపయోగించకుండా ఉత్తర కొరియా చట్టాలుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news