పెళ్లి, పిల్లలు వద్దనుకుంటున్నారా..? ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..?

-

ఈమధ్య పెళ్లి అంటేనే యువత భయపడిపోతుంది. పెళ్లి చేసుకోవడం మా వల్ల కాదని, తోడు కోసం డేటింగ్ చేసినా కూడా పిల్లల్ని కనడం, పెంచడం అసాధ్యమని అంటున్నారు.

అయితే.. పెళ్లి, పిల్లల విషయంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ మిరియాల శ్రీకాంత్ ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

పెళ్లి, పిల్లలు వద్దనుకునేవారు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి.

యువత పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే..?

1. పెరుగుతున్న సంతానలేమి:

మేము చదువుకునే రోజుల్లో పిల్లలకోసం రెండేళ్లు ప్రయత్నిస్తే, గర్భం దాల్చకపోతే దానిని ఇన్ఫర్టిలిటీ అనేవాళ్లు, ఇప్పుడు ఆ గడువు ఒక ఏడాదికి తగ్గించారు, ఎందుకంటే ఏడాది పాటు ప్రయత్నం చేసినా ఫలితం లేదంటే ఇక ఇంకో ఏడాది చేసినా వృథా అని. ప్రస్తుతం ప్రతి ఐదు జంటల్లో ఒక జంటకి పిల్లలు పుట్టట్లేదు.

2. తగ్గిపోతున్న టెస్టోస్టెరాన్:

మగాళ్లలో టెస్టోస్టరాన్ స్థాయిలు బాగా తగ్గుతున్నాయి. కారణాలు చాలా. దీనివలన లేటుగా పెళ్లయిన మొదటి ఐదు పదేళ్లు శృంగారం బాగున్నా తర్వాత కష్టం కావచ్చు.

3. పెరుగుతున్న జన్యులోపాలు:

ఆడవాళ్లు 35 తర్వాత గర్భం దాలిస్తే పుట్టే పిల్లల్లో జన్యులోపాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వాటిలో చాలావరకు స్కానింగ్లో పసిగట్టొచ్చు కానీ, అదంతా ఎందుకు అని.

4. తగ్గుతున్న యాంటీ ముల్లెరియన్ హార్మోన్:

ఇది ఒక స్త్రీలో ఉన్న అండాల సంఖ్యని తద్వారా పిల్లలుపుట్టే అవకాశాలని చెప్తుంది. ఇది బాగా తగ్గిపోతోంది. మనకి తెలియకుండానే పిల్లలు పుట్టే అవకాశాలు చేజారిపోతున్నాయి.

5. ముంచుకొస్తున్న గుండె జబ్బులు, మధుమేహం:

ఇప్పుడు ముప్ఫై దాటగానే ఇవి పొడచూపుతున్నాయ్. అప్పుడు మీరు పిల్లల్ని చూస్తారా మీ ఆరోగ్యం చూసుకుంటారా. అంతేకాక పెళ్లయ్యాక విచ్చలవిడిగా తినటం, తాగటం లాంటివి తగ్గి ఆరోగ్య నియమాలు పాటించి ఇవి రాకుండా చూసుకునే అవకాశం ఉంది.

6. భవిష్యత్తులో పిల్లలకి వెన్ను దన్ను:

కుటుంబ వలయంలో లాంచింగ్ ఫేజ్ అని ఒకటుంటుంది. అంటే ఎదిగిన పిల్లలు ఉద్యోగమో, వివాహమో, వ్యాపారమో చేసుకునే స్థాయి. ఈ సమయంలో వారికి మానసిక తోడ్పాటు తల్లిదండ్రుల నుంచి చాలా అవసరం. మీరు నలభైకి కంటే, వాళ్ళ లాంచింగ్ కి మరో పాతిక వేసుకుంటే ఈలోపు మీరు పోవచ్చు లేదా మంచం పట్టొచ్చు. దాంతో మీకు అపరాధభావం ఇవన్నీ.

7. సెటిల్మెంటు:

జీవితంలో సెటిల్మెంటు అనేది ఒక ఎండమావి, ఒక మజిలీ నుంచి ఇంకోమజిలీకి మన ప్రయాణం సాగిపోతుంటుంది. దాంతో పాటే మిగతావి, ఫలానాది సాధించేవరకూ సాధువులా ఉంటానంటే మీలాంటివాళ్లనే కార్పోరేట్ మూర్తిలాంటి వాళ్లు పట్టుకుపోతారు.

8. నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు:

ఒక తరానికి ప్రేమ, విలువలు, సంప్రదాయాలు అందించేవాళ్లు వీరు. వీళ్లు బాగా ముసలయ్యి మనవళ్లతో గడపలేని వయసులో పిల్లల్ని కనటం వలన వాళ్ల యొక్క దిశానిర్దేశాన్ని ప్రేమని ఈ తరం కోల్పోతారు. వాళ్ల బాల్యంలో ప్రియమైన జ్ఞాపకాలు తక్కువవుతాయి.

9. సమకూర్చలేమేమో అనే భయం:

చాలామంది పిల్లలకి కావలసినవన్నీ ఇవ్వలేం అనే భయం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలు చాలా రెసిలియంట్. అంటే పరిస్థితులకి అనుగుణంగా మారేవాళ్ళు అని. వాళ్లు కూడా మీ కష్టాలని పోరాటాలని చూడాలి, ప్రేరణ పొందాలి. మీరు అన్నింటినీ పళ్లెంలో పెట్టి ఇవ్వటం వలన వాళ్ళకి మీరు నేర్పేది ఏం ఉండదు.

10. ఒంటరితనం:

ఒంటరితనం వలన చాలా మానసిక రుగ్మతలు వస్తున్నాయి. పెళ్లి చేసుకుంటే ప్రేమో, పోరాటమో ఒకరుంటారు మీకు. రోజు గడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news