ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన మ్యాప్స్ యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో యూజర్లు గూగుల్ మ్యాప్స్‌లో తమ ఏరియాలో ఉన్న కోవిడ్ కేసుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకు గాను గూగుల్ తన మ్యాప్స్ యాప్‌లో కొత్తగా కోవిడ్ లేయర్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్లి అందులో పై భాగంలో కుడివైపు ఉండే లేయర్స్ బటన్‌ను ట్యాప్ చేసి అందులో కోవిడ్ 19 ఇన్ఫో అనే లేయర్‌ను ఎంచుకోవాలి. దీంతో యూజర్లకు తమ ఏరియాలో నమోదైన కోవిడ్ కేసుల వివరాలు సులభంగా తెలుస్తాయి. ఈ క్రమంలో వారు ఎక్కడికి వెళ్లాలన్నా ఈ ఫీచర్‌ను ఉపయోగించి ఆ ప్రదేశంలో కోవిడ్ కేసులు ఉన్నాయో, లేదో తెలుసుకోవచ్చు. దీంతో ఆయా ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు.
కాగా గూగుల్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై గూగుల్ మ్యాప్స్ యాప్‌లో లభిస్తోంది. ఈ మేరకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. కాగా ఈ ఫీచర్‌ను యూజర్లకు అందించేందుకు గూగుల్ అనేక సోర్స్‌ల నుంచి సమాచారం తీసుకుంటోంది. జాన్స్ హాప్‌కిన్స్, న్యూయార్క్ టైమ్స్, వికీపీడియా, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలకు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, స్థానిక సంస్థల ఆరోగ్య ఏజెన్సీలు, హాస్పిటల్స్ తదితర అనేక సోర్స్‌ల నుంచి గూగుల్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఈ ఫీచర్‌కు జోడిస్తుంది. అందువల్ల ఎప్పటికప్పుడు నమోదయ్యే కోవిడ్ కేసుల వివరాలు ఈ ఫీచర్ ద్వారా వెంట వెంటనే తెలుస్తుంటాయి.
ఇక ఈ ఫీచర్ సహాయంతో నిర్దిష్టమైన ప్రదేశంలో ఉన్న కేసుల సంఖ్య పరంగా పలు రంగుల్లో లేయర్లను కూడా గూగుల్ చూపిస్తుంది. అంటే కేసులు ఎక్కువగా ఉంటే ఆ ఏరియాను రెడ్ కలర్‌లో చూపిస్తుందన్నమాట. అలాగే కేసుల సంఖ్య పెరుగుతుందా, తగ్గుతుందా ? ట‌్రెండ్ ఎలా ఉంది ? అన్న వివరాలు కూడా తెలుస్తాయి. అందువల్ల యూజర్లు గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న కోవిడ్ లేయర్ అనే ఫీచర్‌ను యూజర్లు ఉపయోగించుకోవాలని గూగుల్ విజ్ఞప్తి చేస్తోంది.