కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితిలో ఉద్యోగాలు దొరకడమే కష్టంగా మారింది. ఈ క్రమంలో ఉద్యోగులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో నెల నెలా ఉన్న ఈఎంఐలను కట్టుకోవడంతోపాటు సంసారాన్ని ఈదడం కష్టంగా మారింది. అయితే ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఇన్సూరెన్స్ ను అందిస్తున్నాయి.
ఇన్సూరెన్స్ కంపెనీలకు కొంత ప్రీమియం చెల్లించి ఉద్యోగులు తమ ఉద్యోగాలకు భద్రత ఉండేలా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఉద్యోగం నుంచి తొలగించినా లేదా కంపెనీ మూతపడినా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉద్యోగులకు 3 నెలల వరకు అన్ని ఈఎంఐలను చెల్లిస్తాయి. గరిష్టంగా రూ.50 లక్షల లోన్ అయితే నెలకు రూ.25వేల చొప్పున మూడు నెలలకు రూ.75వేలను ఇన్సూరెన్స్ కంపెనీలు ఈఎంఐల కింద చెల్లిస్తాయి. ఈ విధంగా ఉద్యోగులు తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీ, కవరేజీని బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ప్రీమియం చెల్లించి సదరు ఇన్సూరెన్స్ ను తీసుకోవచ్చు.
ఇక ఆ విధంగా తీసుకునే ఇన్సూరెన్స్‌కు క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ కూడా ఉంటుంది. అంటే అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్‌లో చేరితే కవరేజీ లభిస్తుంది. కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ తరహా ఇన్సూరెన్స్‌లను అందజేస్తున్నాయి. అయితే వీటిని తీసుకుంటే కనీసం 3 నెలల వరకు ఆగాలి. ఆ తరువాత నుంచే ఇన్సూరెన్స్ అందుబాటులోకి వస్తుంది.