చావు బతుకుల్లో ఉన్న అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో ఎంత బాగా యాక్టింగ్ చేస్తారో… నిజ జీవితంలోనూ ప్రజలకు చాలా సేవ కార్యక్రమాలు చేస్తారు ఎన్టీఆర్‌. అయితే.. తాజాగా ఆస్పత్రిలో ఉన్న తన అభిమానికి కోరికను తీర్చాడు ఎన్టీఆర్‌. వివరాల్లోకి వెళితే… తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం ఎన్టీఆర్ వీరాభిమాని కొప్పాడి మురళి ఇటీవల యాక్సిడెంట్ కి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు కిడ్నీలు దెబ్బతిని.. ఆస్పత్రి చేరాడు మురళి.

తాను చనిపోక ముందే ఒక్కసారి టైగర్ ఎన్టీఆర్ ను కలవాలని డాక్టర్లకు చీటీ రాసి చూపించాడు. అయితే.. ఆ డాక్టర్లు తన తల్లిదండ్రులకు బంధువులకు తెలియజేశారు. అనంతరం ఆ కుటుంబ సభ్యలు తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రాయుడు బాబ్జికి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో దీనిపై ప్రత్యేక చొరవ తీసుకున్న రాయుడు.. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ కు చేరవేశాడు.

దీంతో వెంటనే ఎన్టీఆర్ మురళి తో వీడియో కాల్ చేసి పరామర్శించారు. తన ఆరాధ్యదైవమైన ఎన్టీఆర్ ను చూసిన మురళి… ఆనందోత్సాహంతో ఉప్పొంగి పోయాడు. సంపూర్ణ ఆరోగ్యంతో మూడు నెలల్లో బయటకు వస్తానని తన సైగలతో ఎన్టీఆర్ కు వివరించాడు మురళి. తన అభిమాని సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని ఎన్టీఆర్ కూడా మురళికి ధైర్యం చెప్పారు.