తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం..ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఆయనకు 30 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటుచేసిన 30 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చొరవతో రూ.10కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనితో పాటు అభివృద్ధి చేసిన తారకరామ సాగర్, ఎన్టీఆర్ గార్డెన్‌ను సీఎం ప్రారంభించారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తరహాలో సత్తెనపల్లి తారకరామ సాగర్ ను డెవలప్ చేస్తామని హామి ఇచ్చారు. సత్తెనపల్లికే వన్నె తెచ్చే పనిచేసిన కోడెలను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు సీఎం తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం… సత్తెనపల్లి జడ్పీ బాలికల పాఠశాలలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో కోడెలకు ఎంతో అనుబంధం ఉంది.
ప్రజా ప్రయోజనార్థం నాడు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి స్థాపనకు నాంది పలికింది ఆయనే. తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఉత్తమ ఉద్యోగిగా, గొప్ప కళాకారుడిగా, పరిపాలనా దక్షకుడిగా ఎన్టీఆర్‌తో ఎవరూ పోటీ పడలేదు. నాడు తెదేపాను ఎన్టీఆర్ అధికారం, డబ్బుల కోసం స్థాపించలేదు…తనను అభిమానించే ప్రజలు ఇబ్బందుల్లో ఉండటంతో వారికి తనకు తోచిన సాయం చేసేందుకు ప్రజా సేవలోకి వచ్చారని తెలిపారు. కారణ జన్ముడైన ఎన్టీఆర్ జీవితాన్ని తరతరాలకు తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.