ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు ఒక దారుణ నిరసన వెలుగు చూసింది. ఇక్కడి వీధుల్లో దళిత, ఆదివాసీ యువకులు కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నగ్నంగా నిరసన చేపట్టారు. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందుతున్నారని, అయితే వారిని నియంత్రించడంలో భూపేష్ బాఘేల్ సర్కార్ అలసత్వం చూపిస్తోందంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో మంగళవారం వెలుగు చూసిందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
నిరసనకారులలో ఒకరు విలేకరులతో మాట్లాడుతూ.. నకిలీ కుల సర్టిఫికేట్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వ విచారణ కమిటీ విచారణ నిర్వహించిందని, 267 మంది ప్రభుత్వ ఉద్యోగులు నకిలీ ఎస్సీ/ఎస్టీ సర్టిఫికెట్లను ఉపయోగించారని తేలిందని, అయితే వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.”గతంలో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరాహారదీక్ష చేశాం.. కానీ మా డిమాండ్ వినలేదు. అందుకే ఇప్పుడు నగ్నంగా నిరసన తెలుపుతున్నాం.. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం ఉన్నవారిని అరెస్ట్ చేసి వారు సంపాదించిన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకోవాలి” అని నిరసనకారులు డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చకుంటే మరింత ఉద్ధృతంగా నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.