ఇండియాలో ఓవైపు కోరోనా కేసులు కలవర పెడుతుంటే.. మరోవైపు చాపకింద నీరులా ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలో ఇప్పటి వరకు 2630 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో ఇప్పటి వరకు 26 రాష్ట్రాలకు ఓమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. అయితే బాధితుల్లో 995 మంది ఓమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకున్నారు. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ తక్కువ కాలంలోనే ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలకు వ్యాపించింది. ముఖ్యంగా యూఎస్ఏ, యూకే దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోెంది.
ఇదిలా ఉంటే దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 797 ఓమిక్రాన్ కేసులు రాగా.. ఢిల్లీలో 465 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ముంబై నగరంలోనే ఎక్కువగా ఓమిక్రాన్ కేసులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓమిక్రాన్ బాధితుల్లో చాలా మందికి స్వల్ప లక్షణాలే ఉండీ.. వేగంగా కోలుకుంటున్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ చాలా వరకు అవసరం రావడం లేదు. ఇది కొద్దిగా ఊరట లభించే అంశం.