రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసిన జగన్ ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రతిపార్లమెంటు నియోజకవర్గాన్నీ ఒక జిల్లాగా మారుస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. సో.. మొత్తం 25 జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, గిరిజన జిల్లాలను రెండు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో వీటి సంఖ్య 26కు పెరిగే అవకాశం ఉందని ఇప్పటి వరకు అందరూ లెక్కలు వేసుకున్నారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభించారు. అయితే, ప్రస్తుతం ఈ జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల ఉద్యమాలు ఊపందుకున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ట్టుగా సంకేతాలు వస్తున్నాయి. కొన్ని చోట్ల జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలకు చాలా దూరంలో ఉన్నాయి. దీంతో లోక్‌సభ నియోజకవర్గాల వారిగానే ముందు జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించిన జగన్ తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టే తాజాగా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అంటే.. ప్రజాభీష్టానికి పెద్దపీట వేయడం ద్వారా.. ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతకు చెక్ పెట్టాలనేది సర్కారు వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే 26 జిల్లాల స్థానంలో 32 జిల్లాల ఏర్పాటుకు రెడీ అవుతున్నట్టు అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. ఇప్పటి వరకు పార్లమెంటు నియోజకవర్గాలనే జిల్లాలుగా చేయాలని నిర్ణయం తీసుకున్న జగన్ ఇప్పుడు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా జిల్లాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు అధికారుల నుంచి సమాచారం.
అదే సమయంలో ప్రత్యేక జిల్లా ఉద్యమాలు సాగుతున్న ఆదోని, పలాస, గూడూరు నియోజకవర్గాలను సమీప ప్రాంతాలతో కలిపి కొత్త జిల్లాలుగా మార్చేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో పెద్దగా ఉన్న రెవెన్యూ మండలాలను కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నట్టు అధికారుల నుంచి సమాచారం. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో 32 జిల్లాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తాజా సమాచారం.