దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. KG రూ.50- రూ.80 వరకు పలుకుతోంది. ఉత్పత్తిలో కొరత, పండుగ సీజన్ కావడంతో వినియోగం పెరిగి డిమాండ్ ఏర్పడటమే ధర పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్రలో ఇటీవల భారీ వర్షాలకు పంట రాబడి కూడా తగ్గిపోయింది. ఖరీఫ్ పంట డిసెంబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మరో 2 నెలల పాటు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.
వాతావరణ కారణంగా ఖరీఫ్ ఉల్లి ఆలస్యం కావడం..పంట ఆలస్యంగా రావడం దీనికి ప్రధాన కారణం అంటున్నారు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ అధికారులు. ఖరీఫ్ ఉల్లి ఇప్పటికే మార్కెట్ లోకి రావాల్సి ఉండగా.. ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతోపాటు నిల్వ చేసిన రబీ ఉల్లి అయిపోవడం ఉల్లి ధరలు పెరుగుటకు కారణమయ్యాయని తెలిపారు. ఉల్లి సరఫరాలో ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఉన్నాయి.. హోల్ సేల్, రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు పెరిగాయని అధికారులు చెపుతున్నారు. దేశీయ మార్కెట్లో కూరగాయల లభ్యత పెంచడం, ధరలను అదుపు చేయడం లక్ష్యంగా 2024 డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై టన్నుకు 800 డాలర్ల కనీస ఎగుమతి ధర పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అక్టోబర్ 29 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అంతేకాకుండా ఉల్లి నిల్వలు పెంచేందుకు అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లి సేకరణను కూడా ప్రభుత్వం ప్రకటించింది.