ఉల్లిధరలు ఆకాశంనంటుతుండటంతో దేశ వ్యాప్తంగా నిరసనల సెగలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కొంతమంది ఉల్లిని బంగారంతో పోల్చితే మరికొందరు..ఉల్లి పొదుపైపై సూత్రాలు చెబుతూ వాల్‌పోస్టులపై పెడుతున్నారు. ఉల్లి ధరలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ యువ జంట వివాహంలో ఉల్లి పెళ్లి బహుమతిగా మారింది. కిలో రూ.150 చొప్పున కొనుగోలు చేసిన రెండు కేజీల ఉల్లిగడ్డలను ఆ యువజంటకు స్నేహితులు కానుకగా అందించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలియక ఆ కొత్త జంట ఆ కానుకను తెరవగానే ఒక్కసారిగా పెళ్లి మండపంలో నవ్వులు విరబూశాయయి. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త కపుల్స్ చాలా అదృష్టవంతులు నేను మూడు రోజులు క్యూలో నిలబడి కూడా ఉల్లిపాయలను ఇంటికి తేలేకపోయాను అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఈ వీడియోపై స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లిపాట్లు తారస్థాయికి చేరాయి.
బహిరంగ మార్కెట్‌లో కేజీ ఉల్లిపాయ ధర ఆల్ టైం రికార్డును తిరగరాస్తూ రూ.130కి చేరుకుంది. బెంగళూరు పట్టణంతో పొలిస్తే మాత్రం రూ.20 తక్కువనే చెప్పాలి. ఉల్లిధరల భారీ నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకుండా సబ్సిడీపై అందజేస్తామని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అవినీతి చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. బినామీ వ్యక్తుల ఆధార్ కార్డులను నమోదు చేసుకుని నిర్వాహాకులే స్టోర్లకు తరలిస్తున్నట్లు సమాచారం. దీంతో గంటల కొద్దీ క్యూలో నిల్చున్నా ఉల్లిపాయలు అయిపోయాయని బోర్డు తిప్పేస్తుండటాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
ప్రభుత్వం రూ.25కే ఉల్లిపాయలు అందజేస్తోందన్న ఆశతో ఆదివారం ప్రతి పట్టణంలోని కేంద్రాల వద్ద వేలాది మంది భారీ క్యూలో నిలబడ్డారు. ప్రతి కేంద్రంలో200 మందికి మించకుండా సరఫరా చేసి నిర్వాహాకులు అయిపోయాయని చెప్పేయడంతో ఆందోళనలు జరిగాయి. ఇక తెలంగాణలో అయితే పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ ప్రభుత్వ సబ్సిడీ కేంద్రాల ఊసే లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. కోయకుండానే ఉల్లి ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది.