పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాల్లోనూ అదానీ అంశంపై రగడ కొనసాగుతోంది. రెండ్రోజులుగా ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ అధికార పక్ష ఎంపీలు నినాదాలు చేయడం, ఇందుకు దీటుగా హస్తం పార్టీ సభ్యులు ఆందోళన చేయడం వల్ల లోక్‌సభ వాయిదా పడింది. అటు.. రాజ్యసభ సైతం వాయిదా పడింది.
యూకేలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే అవకాశమే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. రాహుల్‌ను విమర్శిస్తున్న వారు గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, అదానీ గ్రూప్ షేర్ల ధరల అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ పార్లమెంట్ హౌస్ నుంచి ఈడీ కార్యాలయానికి విపక్ష ఎంపీలు ర్యాలీగా వెళ్లనున్నారు. ఈడీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు పత్రాన్ని సమర్పించనున్నారు. విపక్షాల ర్యాలీ నేపథ్యంలో ఈడీ కార్యాలయం ఎదుట భద్రతను మరింత పెంచారు దిల్లీ పోలీసులు.