భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బుధవారం ఉదయం విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఎన్‌సీపీ సహా 12 విపక్ష పార్టీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి. సోనియా గాంధీ ఆధ్వర్యంలో విపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.
సరిహద్దు వివాదంపై మౌనాన్ని వీడాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించాయి. చైనా దురాక్రమణపై సభలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు కేంద్రం జవాబు చెప్పాలని డిమాండ్ చేశాయి. అంతకుముందు చైనాతో ఉద్రిక్తలపై చర్చకు డిమాండ్ చేస్తూ పలువురు విపక్ష పార్టీల ఎంపీలు ఉభయ సభలకు వాయిదా తీర్మానాలు అందజేశారు.
అంతకు ముందు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. పార్లమెంటు భారత్- చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతించకపోవడంపై సోనియాగాంధీ తీవ్రంగా మండిపడ్డారు.