కోవిడ్ రెండో వేవ్ ప్రభావం తగ్గుతుండడంతో త్వరలో మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో దేశంలో అనేక చోట్ల పిల్లల నుంచి శాంపిల్స్ సేకరించి కోవిడ్ యాంటీ బాడీలు (Covid Antibodies) టెస్టులు చేస్తున్నారు. ఇక ముంబైలో ఈ విధంగానే సీరో సర్వే చేపట్టారు. ఇందులో షాకింగ్ విషయం వెల్లడైంది.
ముంబైలో ఇటీవల 6 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల నుంచి శాంపిల్స్ సేకరించి సీరో సర్వే చేపట్టారు. ఈ క్రమంలో వారిలో సగం మందిలో కోవిడ్ యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది. దీన్ని బట్టి చూస్తే కోవిడ్ మూడో వేవ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముంబైలోని బీవైఎల్ నాయర్ హాస్పిటల్, కస్తూర్బా మాలిక్యులార్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టారు. కోవిడ్ మూడో వేవ్ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు వారు ఈ సర్వే చేశారు. ఈ క్రమంలోనే గతంలో చేపట్టిన సీరో సర్వే కన్నా ఈ సర్వేలోనే పిల్లల్లో కోవిడ్ యాంటీ బాడీలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
పిల్లల్లో కోవిడ్ యాంటీ బాడీలు పెరగడం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అంటున్నారు. అంటే వారికి కోవిడ్ ఎక్కువగా వస్తుందని స్పష్టమవుతుందని చెబుతున్నారు. కోవిడ్ మూడో వేవ్‌లో పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు ఇది నిదర్శమని అంటున్నారు.