కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. దీని వల్ల ఎంతో మంది తమ ఆత్మీయులను కోల్పోయారు. ఇక మన దేశంలో అయితే ఏకంగా 75వేల మంది పిల్లలు ఒకరు లేదా ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయారు. ఈ విషయాన్ని నేషనల్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్ ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే అలాంటి పిల్లలకు సంరక్షణ అవసరం అని ఆ సంస్థ అభిప్రాయపడింది.
మహమ్మారి సమయంలో మొత్తం 75,320 మంది పిల్లలు తమ తల్లి లేదా తండ్రి లేదా తల్లిదండ్రులను కోల్పోయారని బాలల హక్కుల సంఘం తెలిపింది. 2020 ఏప్రిల్ 1 నుండి 2021 జూలై 23 వరకు అనాథలుగా మారిన లేదా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంఖ్య వివరాలను బాల్ స్వరాజ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ మేరకు అవే వివరాలను ఎన్‌సీపీసీఆర్ తన అదనపు అఫిడవిట్‌లో తెలియజేసింది.
మహమ్మారి కారణంగా ప్రభావితమైన పిల్లలలో 8-13 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు అత్యధికంగా 29,886 మంది ఉన్నారని వెల్లడైంది. మహారాష్ట్రలో 13,589 మంది పిల్లలు, ఒడిశాలో 6,562 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 6,210 మంది పిల్లలు ప్రభావితమయ్యారని ఎన్‌సీపీసీఆర్ తెలిపింది. కొన్ని సందర్భాల్లో డేటాను పరిశీలిస్తున్నప్పుడు పిల్లలకి లేదా వారి కుటుంబాలకు ఇవ్వబడుతున్న పథకాలు, ప్రయోజనాలు సరిపోవని కమిషన్ గమనించింది. ఇతర ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. పిల్లలు లేదా వారి కుటుంబం లేదా సంరక్షకులకు ప్రయోజనాలను కల్పించాల్సి ఉంటుందని తెలిపింది.