తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ఎఫ్‌సీఐ అధికారులతో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి కొనుగోళ్లకు సిద్దం కావాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.. దానికోసమే రాష్ట్రంలో 7100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. వచ్చే వారం ధాన్యం కొనుగోళ్లపై మరోమారు సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. యాసంగికి సీజన్ సీఎంఆర్‌ను ఈ నెల 30వ తేదీలోగా మిల్లర్ల నుంచి సేకరించాలని దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
ఇప్పటి నుంచి సీఎంఆర్ అప్పగించే విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా క్షమించేది లేదని మంత్రులు హెచ్చరించారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను అప్పగించి ఈ సీజన్ ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లుకు సూచించారు.