దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమంగా దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. 53 మంది విశిష్ట వ్యక్తులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మ అవార్డులను అందించారు. తెలుగు వారైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి పద్మభూషణ్‌ను అందుకోగా, సినీసంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, చిరుధాన్యాల ప్రచారకర్త దూదేకుల ఖాదర్ వలి (కర్ణాటక నుంచి), డాక్టర్ అబ్బారెడ్డి నాగేశ్వరరావు పద్మశ్రీలను స్వీకరించారు.
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ (మరణానంతరం), ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్) సృష్టికర్త, పశ్చిమబెంగాల్‌కు చెందిన దిలీప్ మహలనబిస్‌తోపాటు, అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎస్‌ఆర్ శ్రీనివాస్ వర్ధన్‌లకు రాష్ట్రపతి పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రముఖ గాయనీమణి వాణీ జయరాం (మరణానంతరం), నవలా రచయిత ఎస్‌ఎల్ భైరప్ప, సామాజికవేత్తలు దీపక్ ధర్, సుధామూర్తిలకు పద్మభూషణ్ పురస్కారాలు అందించారు. వీరుకాకుండా మరో 45 మందికి పద్మశ్రీలు ప్రదానం చేశారు. ములాయంసింగ్ యాదవ్ తరఫున ఆయన తనయుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, వాణీజయరాం తరఫున ఆమె సోదరి ఉమామణి రాష్ట్రపతి నుంచి పురస్కారాలను స్వీకరించారు.