ఇటీవల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అక్కడి రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. నటించడంలో ఇమ్రాన్ ఖాన్.. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్‌లను మించిపోయారని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ అధినేత మౌలాన ఫజ్లూర్ రెహ్మాన్.. ఇమ్రాన్‌పై దాడిని ఓ డ్రామాగా అభివర్ణించారు. వజీరాబాద్ ఘటన తర్వాత తనకు ఇమ్రాన్‌పై సానుభూతి కలిగిందని ఆయన పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఇమ్రాన్ డ్రామా చేస్తున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
ఇమ్రాన్‌పై ఎన్ని తూటాలు కాల్చారు.. ఎన్ని చోట్ల గాయాలయ్యాయి అన్న అంశాలపై రెహ్మాన్ సందేహాలు లేవనెత్తారు. దాడి జరిగిన వెంటనే ఖాన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించకుండా లాహోర్‌కు తీసుకువెళ్లడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఖాన్ అబద్ధాలను గుడ్డి జనం కూడా నమ్ముతున్నారని అన్నారు. బాంబు శకలాల గురించి విన్నాం కానీ.. తూటా శకలాల గురించి ఇప్పుడే తొలి సారి వింటున్నామన్నారు. బుల్లెట్ గాయాలకు క్యాన్సర్ వైద్యశాలలో చికిత్స ఎందుకు చేయించారని ప్రశ్నించారు.