తెలంగాణ రాష్ట్రంలోనూ, జి.హెచ్.ఎమ్.సి. పరిధిలోను పార్టీలో కార్యకర్తలు క్రియాశీలకంగా ఉన్నారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కార్యకర్తలు, యువ జనసైనికులు నుంచి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని పలు విజ్ఞప్తులు వచ్చాయి అని ఆయన వివరించారు. వారి వినతి మేరకు గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశానన్నారు.
నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నారని ఆయన వివరించారు. గ్రేటర్ లో పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ.. ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయన్నారు. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయని, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకొంటున్నారని వెల్లడించారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుందన్నారు.