ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికపై సందిగ్ధం వీడారు. ఇక్కడ నుంచి పోటీ చేయాలనే నిర్ణయించారు. వాస్తవానికి ప్రతిప్రతినిధులు మరణిస్తే.. ఆ స్థానాలను వారి కుటుంబాలకు కేటాయిస్తే.. ఇతర పక్షాలు దూరంగా ఉండడం సంప్రదా య బద్ధంగా నడుస్తున్న రాజకీయ ప్రక్రియ. అయితే, దాదాపు దేశవ్యాప్తంగా ఈ సంప్రదాయాన్ని పార్టీలు పక్కన పెట్టేశాయి. ఈ క్రమంలోనే తిరుపతి ఉప పోరులో అన్ని పార్టీలూ తలపడేందుకు రెడీ అయ్యారు. ఇక, అందరికన్నా ముందుగా టీడీపీ ఒక అడుగు వేసేసి.. అభ్యర్థిని ఖరారు చేసింది. గత ఏడాది ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికే చంద్రబాబు మరోసారి ఛాన్స్ ఇచ్చారు.
వాస్తవానికి ఈ టికెట్‌ను టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యకు ఇస్తారని అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా మరోసారి పనబాక లక్ష్మిని చంద్రబాబు ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చేశాయి. మరి దీనికి కారణం ఏంటి? నిజానికి కాంగ్రెస్ నుంచి గత ఏడాది ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చారు లక్ష్మి. పార్టీ తరఫున ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ వాయిస్ వినిపించేందుకు ఇష్టపడలేదు. చంద్రబాబు అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చినా.. ఆమె పట్టించుకోలేదు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత.. ఇప్పటి వరకు ఆమె ఇంటి గడప దాటలేదు. మరి అలాంటి నేతకు చంద్రబాబు హఠాత్తుగా ఇప్పుడు కీలకమైన తిరుపతి స్థానాన్ని ఎందుకు కేటాయించారనేది ప్రశ్న. దీనికి రెండు సమాధానాలు చెబుతున్నారు పార్టీ సీనియర్ నాయకులు. ఒకటి.. వైసీపీ నాయకుడు బల్లి దుర్గా ప్రసాద్ మృతి చెందిన నేపథ్యంలో ఇక్కడ నుంచి ఆయన భార్యకు మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో.. మహిళా సెంటిమెంట్ ప్లే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పనబాక లక్ష్మి అయితే.. ఈ సెంటిమెంటు అంతో ఇంతో తగ్గుముఖం పట్టి.. ఓట్లు టీడీపీవైపు కూడా పడే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇక. రెండో కారణం.. రాజధాని ప్రాంతంతో అంతో ఇంతో సంబంధాలు ఉన్న సీనియర్ మహిళా నేతగా పనబాక లక్ష్మి.. అందరికీ పరిచయస్తురాలు. ప్రస్తుతం తిరుపతి ఉప పోరులో రాజధాని అజెండా వినిపించనుండడం.. కాంగ్రెస్ కూడా రాజధానికి మద్దతుగా నిలవడం.. ఆ పార్టీ నుంచే వచ్చిన పనబాక లక్ష్మికి వీరు పరోక్షంగా సాయం చేసే అవకాశం మెండుగా ఉండడం.. రాజకీయంగా అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్న మహిళగా ఆమె కు పేరుండడం వంటివి పాజిటివ్‌గా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఈ వ్యూహంతోనే ఆమెకు టికెట్ ఇస్తే.. ఆసక్తికరమే! ఏం జరుగుతుందో చూడాలి.