ఫ్యాన్స్ కి పెయిన్: పవన్ నోట బాబు పాత పాట!

-

అన్న చిరంజీవి కాస్త తొందరపాటు చర్యలు చేసినా.. తమ్ముడు పవన్ మాత్రం రాజకీయాల్లో నిలదొక్కుకుంటాడేమో అని సగటు అభిమాని అభిప్రాయపడ్డాడనే అనుకోవాలి! కాకపోతే చిరు ప్రజారాజ్యం బాపతు సంగతులు మరిచిపోకో లేక తాజా రాజకీయాల ప్రభావమో కానీ… పవన్ సభలకు జనాలు వచ్చారే తప్ప ఓట్లు మాత్రం వేయలేదు! గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఘోరంగా ఓడిపోవడం… రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 6.78 శాతం మాత్రమే ఓట్లు పోలవడంతో పవన్ పై కూడా ఆశలు నీరుగారిపోయాయనే చెప్పాలి! ఈ క్రమంలో జనసేన ను నిలబెట్టాలనే పవన్ కష్టపడుతున్నట్లుగానే కన్నిపిస్తున్నారు. ఇది సగటు జనసేన కార్యకర్తకు సంతోషం కలిగించే విషయమే! కానీ… కాస్త లోతుగా చూసేవారికి మాత్రం బీజేపీ – టీడీపీల భవిష్యత్తుకు సాయపడుతూ, తన రాజకీయ మనుగడ కాపాడుకోవాలన్నట్లుగానే పవన్ రాజకీయాల్లో హడావిడి చేస్తూనే ఉన్నట్లు కనిపిస్తుందని అంటున్నారు! దీంతో… రాజకీయాల్లో పవన్ సొంతంగా ఆలోచించడం లేదు అనే కామెంట్లు సగటు పవన్ ఫ్యాన్స్ కి చాలా నొప్పి కలిగిస్తున్నాయనే చెప్పాలి!

నిజం చెప్పాలంటే… పవన్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది! 2019 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా జనాలు తండోప తండాలుగా వచ్చేవారు! అందులో సగం మంది ఓట్లు లేని వారే అని కామెంట్లు వినిపించినా… వచ్చే ఎన్నికల నాటికి పవన్ సొంతంగా ఆలోచించి, పక్కా ప్రణాళికతో రాజకీయం చేస్తే మాత్రం గత శాతం కంటే మెరుగైన ఓట్లే పడొచ్చు! కానీ… పవన్ ని ఎంత అభిమానించే మనిషిగా చూద్దామన్నా… ఆయన మాటల్లో, ఆలోచనల్లో, విమర్శల్లో, డిమాండుల్లో…. ఎక్కడో “టీడీపీ వాసన” బాగా వస్తుంటుందని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు!! అందుకు చాలా ఉదాహరణలే ఉన్నా… తాజా ఉదాహరణ ఒకటి తీసుకుందాం!

తాజాగా… నెల్లూరు జనసేన నాయకులతో టెలీకాంఫరెన్స్ నిర్వహించారు పవన్ కల్యాణ్! ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాట… “అధికారికంగా ప్రకటిస్తున్న కేసుల కంటే ఎక్కువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని”! ఇది టీడీపీ నేతలు చేసిన పాతచింతకాయ పచ్చడి విమర్శ! దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి దిమ్మ తిరిగే సమాధానాలు వచ్చే సరికి… ఆ విషయంపై టీడీపీ నేతలు సైలంట్ అయిపోయి చాలా రోజులే అయ్యింది! కానీ… తాజాగా మళ్లీ బాబు నోట పలికి పాచిపోయిన ఆ పాతపాటనే పవన్ అందుకున్నారు!

దీనివల్ల పవన్.. తనకున్న క్రెడిబిలిటీని కోల్పోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు మార్కు రాజకీయం ఎలాగూ షేడ్డుకు చేరుకునే స్థాయికి చేరిపోతున్న దశలో… వైకాపాకు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా పవన్ కృషి చేయాలి తప్ప… బాబు అడుగుజాడల్లోనే నడుస్తాను.. బాబుకి అనధికారిక అనుచరుడిగానే ఉంటాను అన్నట్లుగా పవన్ ప్రవర్తించకూడదని అభిమానులు కోరుకుంటున్నారు! వారి మాటలు పవన్ వింటే మాత్రం… ఏపీ భవిష్యత్తు రాజకీయాల్లో పవన్ కచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారనే అనుకోవచ్చు! అలాకాని పక్షంలో… ఆటలో అరటిపండుగా మిగిలిపోయే పరిస్థితి దారుపురించడానికి ఎక్కువ సమయం పట్టదని పవన్ గుర్తించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news