హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జనసేన పార్టీ ప్రకటించింది. కరోనా బారినపడిన పవన్‌కు మూడు రోజుల కిందట వైద్యులు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. దీంతో పవన్‌కు కరోనా తగ్గిపోయిందని స్పష్టంచేశారు. తన ఆరోగ్య క్షేమాల కోసం ఆకాంక్షించిన వారికి, పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ తీవ్రత ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అంతేకాకుండా వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న తర్వాత పవన్ కల్యాణ్ కరోనా సోకింది. దీంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటేనే పవన్ కల్యాణ్ ఏపీలో జరుగుతున్న కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రధానంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు వేయింది. టెన్త్ పరీక్షలు వాయిదాపై ప్రకటన చేయలేదు. తాజాగా కరోనా నుంచి కోలుకున్న పవన్… రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెడతారని భావిస్తున్నారు.