కర్నూలు: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. N440K వేరియెంట్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు వేగం పెంచారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. శనివారం చంద్రబాబుకు నోటీసులు ఇస్తామని కర్నూలు ఎస్పీ డా.పక్కిఱప్ప తెలిపారు. అంతేకాదు 7 రోజులు విచారణకు హాజరు కావాలని కోరుతామన్నారు. శాస్త్రీయంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తగిన నిర్ణయం తీసుకుంటారని ఎస్పీ డా.పక్కిఱప్ప స్పష్టం చేశారు.
ఇక చంద్రబాబు నాయుడు పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. కరోనా మహమ్మారి వ్యాప్తిపట్ల అప్రమత్తం చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? అని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ సీఎం సోరెన్ ట్వీట్ పై ప్రధాని మోడీకి అందరం సపోర్ట్ చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం కక్షసాధింపు కాదా? అని ప్రశ్నించారు. తనకో నీతి, ఎదుటివారికో రీతిలో జగన్మోహన్ రెడ్డి వైఖరి కొనసాగుతోందన్నారు. తక్షణమే చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.