శ్రీకాకుళం : ఆమదాలవలసలో జనసేన శ్రేణుల పై వైసీపీ దాడిని ఖండించారు పవన్ కళ్యాణ్. దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది జనసేన పార్టీ. రోడ్ల అధ్వాన్న స్థితిని తెలియచేస్తే దాడులు చేస్తారా? పోలీసుల సమక్షంలోనే ఆమదాలవలస జనసేన నాయకుడు రామ్మోహన్ రావు పై దాడి చేశారని పవన్ నిప్పులు చెరిగారు.
సమస్యను తెలియజేసిన వారిని గాయపరిచి ఎదురు కేసులు పెడతారా ? జనసేన శ్రేణుల పై దాడులు చేయడం చాలా బాధాకరమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేస్తే సమస్య పెద్దదవుతుంది తప్ప… పరిష్కారం కాదని తెలిపారు.
మా కార్యకర్తలపై దాడి జరిగితే తానే స్వయంగా రోడ్ల పైకి వస్తానని హెచ్చరించారు పవన్. ఆ పరిస్థితి తీసుకురావొద్దని కోరుతున్నానని… అందరికీ సమన్యాయం చేయాలని పోలీసులను అభ్యర్ధిస్తున్నాని తెలిపారు. మా వాళ్లపై కేసులు పెట్టి దాడులు చేయడం ఆపేసి వైసీపీ ప్రభుత్వం ప్రజాసమస్యల పై దృష్టి సారించాలని హితువు పలికారు.కాగా.. నిన్న ఆమదాలవలసలో జనసేన శ్రేణులపై వైసీపీ నాయకులు దాడిచేసిన సంగతి తెలిసిందే.