నిన్నటి వేళ ఈనాడు సంస్థల అధినేత్రి బృహతి కల్యాణ వేడుక కన్నుల పండువగా సాగింది. వధూవరులను పవన్ కల్యాణ్ ఆశీర్వదించారు. ఈనాడు దినపత్రిక నిర్వహణ సారథి, రామోజీ రావు పెద్ద కుమారుడు కిరణ్ రెండో కుమార్తె అయిన బృహతికి, దండమూడి అమర్ మోహన్ దాస్,అనితల కుమారుడు అక్షయ్ కు జరిగిన ఈ వేడుకలకు జగన్ కూడా ఆహ్వానం అందింది. కానీ ఆయన ఎందుకనో వెళ్లలేదు. ఆయన తరఫున పెళ్లికి విజయ్ సాయి రెడ్డి వెళ్లారని తెలుస్తోంది. ఆయన తప్ప పెద్దగా వైసీపీ తరఫున నాయకులు ఎందుకనో వెళ్లలేదు. ఇందుకు కారణాలు ఏమయి ఉండవచ్చు అన్న చర్చ కూడా నడుస్తోంది. తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర పెద్ద కేసీఆర్ వెళ్లి వధూవరులను ఆశీర్వదించి వచ్చారు. ఆయనతో పాటు కీలక తెలంగాణ రాష్ట్ర సమితి నేతలంతా వేడుకల్లో భాగం అయ్యారు.
ఇక పవన్ రాకతో ఈ వేడుకల్లో ఒక ఉత్సాహ భరిత వాతావరణం నెలకొంది.ఆయనతో పాటు జనసేన వ్యవహారాలు చూసే నాదెండ్ల మనోహర్ కూడా వెళ్లారు. ఓ విధంగా పవన్ ఈ వేడుకలకు హాజరై హుందాతనం నిలుపుకున్నారు. కానీ వైసీపీ తరఫున పెద్దలు, ఇతర నాయకులను సాక్షాత్తూ ఈనాడు ఎండీ కిరణ్ వెళ్లి పిలిచినా గైర్హాజరయి, విమర్శలకు తావిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. వాస్తవానికి గతంలో ఓ పెళ్లి వేడుకకు వైసీపీ చీఫ్ జగన్ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంగా రామోజీ ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఆయనతో చాలా సేపు సమాలోచనలు జరిపారు. అవే అప్పుడు పెను సంచలనం అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈనాడు ఇంటి వేడుకలకు జగన్ ఎందుకనో దూరం అయ్యారు. కానీ జనసేనాని మాత్రం తన బిజీ షెడ్యూల్లో కూడా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి, రామోజీ రావు వంటి పెద్దలతో ముచ్చటించి వచ్చారు.