సీఎం జ‌గ‌న్‌కు.. వైసీపీకి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌…

-

వైసీపీ ప్రభుత్వంపై జనసేన చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. ఇసుక కొరతతో పని దొరక్క కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన పవన్‌కల్యాణ్‌ ఏపీలో పెరిగిపోతోన్న భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలతో పాటు ఇసుక కొరత వంటి అంశాలపై పవన్ వినతిపత్రం ఇచ్చారు. అయితే ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి తాము టీడీపీ కాదని, జనసేన అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారని, మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు. “ఏం జగన్ రెడ్డి గారూ, నేను చేసుకున్న మూడు పెళ్లిళ్ల కారణంగానే మీరు, విజయసాయిరెడ్డిగారూ కలిసి రెండు సంవత్సరాలు జైల్లో కూర్చున్నారా? అడిగిన దానికి సరిగా స్పందించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు” అంటూ హెచ్చరించారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని, సీఎం జగన్‌కు అసలు చరిత్ర తెలుసా? అని సూటిగా ప్రశ్నించారు.

తమిళనాడులో ఇంకా తెలుగు మీడియం ఉందని, టీచర్లకు ఆంగ్లంలో ప్రావీణ్యం కల్పించకుండా ఒకే సారి మారిస్తే ఎలా? అని మరోసారి ప్రశ్నించారు. ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలైందని, వైసీపీ నేతలు భాషా సంస్కారాన్ని మరిచి మాట్లాడినా.. తాము పాలసీ పరంగానే మాట్లాడుతామని పవన్‌ చెప్పారు. వైసీపీ నేతలు సమస్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గెలుపోటములు తమకు తెలియదని, ప్రజా సమస్యల కోసం పోరాడటమే తమకు తెలుసన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలనే ఈ ప్రభుత్వం చేస్తోందని పవన్‌ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news