ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులని… కర్నూలు జిల్లాలోని ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. స్మారక చిహ్నం కోసం కోటి రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
సమతా వాదులు.. ప్రజాసేవకులు నిత్యం స్మరించుకోవాల్సిన విలక్షణ నాయకుడు సంజీవయ్య అని… తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో వెనుకబాటుతనం రూపుమాపడానికి బీజాలు వేశారన్నారు.
శ్రీకాకుళంలో వంశధార ప్రాజెక్టు, రాయలసీమలో గాజులదిన్నె, వరదరాజులు ప్రాజెక్టులు ఆ అపర భగీరథుని సంకల్పంతోనే రూపుదిద్దుకున్నాయని.. కృష్ణా నదిపై పులిచింతల ప్రాజ్టెకు అంకురార్పణ చేసినదీ సంజీవయ్యేనని గుర్తు చేశారు. 6 లక్షల ఎకరాలను దళితులు, వెనుకబడిన వర్గాలు, కార్మిక కర్షకులు, కుల వృత్తిదారులకు పంపిణీ చేసిన భూభాంధవుడని.. అర్ధ శతాబ్దం కిందటే ఆయన కులాల మధ్య సయోధ్యను సాధించారని తెలిపారు. బోయలు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఇతర అనుబంధ కాపు కులాలను వెనుకబడిన జాబితాలో చేర్చి వారి అభ్యున్నతికి పాటు పడ్డారని పవన్ కళ్యాణ్ చెప్పారు.