పేటీఎం సీఈవోపై నెటిజన్ల విమర్శలు.. చీప్‌ ట్రిక్స్‌ అంటూ కామెంట్స్‌..!

-

కేరళలో భారీ వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. అనేక మంది చనిపోగా కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో బాధితులకు సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఇప్పటికే తమ వంతుగా కొన్ని లక్షల రూపాయలను విరాళం ఇచ్చారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు కూడా కేరళ వాసులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి. అయితే తాజాగా పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ కూడా కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం అందజేశారు. అది ఎంతో తెలుసా..? కేవలం రూ.10వేలు మాత్రమే. అవును, మీరు షాక్‌కు గురైనా అది నిజమే.

పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ ఆస్తి విలువ 1.7 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. అయినప్పటికీ ఆయన సెలబ్రిటీలలా లక్షల రూపాయలు విరాళం ఇవ్వకుండా కేవలం రూ.10వేలు ఇచ్చారు. ఇక దాని గురించి ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. అందరూ పేటీఎం ఉపయోగించి పేటీఎం ద్వారా కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం అందించండి.. అంటూ పేటీఎంను ప్రమోట్‌ చేశారు. దీంతో నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు.

అన్ని కోట్ల ఆస్తి ఉండి వరద బాధితులను ఆదుకునేందుకు కేవలం రూ.10వేలు ఎలా ఇస్తావంటూ విజయ్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిందే రూ.10వేలు, అది కూడా పేటీఎం ప్రమోషన్‌ చేశారు. ఇంతకన్నా చీప్‌ విషయం ఇంకొకటి ఉండదు. అన్ని కోట్ల ఆస్తి పెట్టుకుని ఇంత తక్కువ డబ్బు విరాళం ఎందుకు ఇచ్చారు, ఇస్తే దాన్ని ప్రమోట్‌ చేసుకోవడం ఎందుకు..? అంటూ మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. అయితే పేటీఎం సంస్థ మాత్రం 48 గంటల్లోనే రూ.10 కోట్ల విరాళం సేకరించింది. దానికి తమ సంస్థ నుంచి రూ.1 కోటి కలిపి మొత్తం రూ.11 కోట్లను కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చింది. ఏది ఏమైనా.. పేటీఎం సీఈవో చేసిన పని మాత్రం చాలా మంది నెటిజన్లకు కోపం తెప్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news