గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదలు వచ్చాయి. దీనికి తోడు బుడమేరు వాగుకు వరద ఉధృతి పెరగడంతో ఆ వాగు కెనాల్స్‌కు గండ్లు పడి విజయవాడ నగరం ముంపునకు గురైంది.దీంతో భారీగా ఆస్తి, పంట, పశుసంపద నష్టం సైతం భారీగా వాటిల్లింది. సహాయక చర్యల కోసం నేటికీ ప్రజలు అర్రులు చాస్తున్నారు.
వరదలకు కారణమైన కృష్ణమ్మ ఇప్పడిప్పుడే నెమ్మదిగా శాంతిస్తోంది. ఎగువన శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను మూసివేయడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరదప్రవాహం తగ్గింది. ప్రస్తుతం 1,87,900 క్యూసెక్కుల వరద ఉధృతి మాత్రమే కొనసాగుతోంది. మరోవైపు బుడమేరు వాగు కాలువకు పడిన గండ్లను పూడ్చేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.