కరోనా వైరస్ చైనాలోని వూహాన్‌లో ముందుగా పుట్టిందని ఇప్పటికీ చాలా మంది చెబుతారు. వూహాన్‌లోని ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకై అక్కడి సీ ఫుడ్ మార్కెట్ ద్వారా వ్యాపించిందని జగమెరిగిన సత్యమే. కానీ అక్కడకు చాలా రోజుల తరువాత వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం కూడా కరోనా వైరస్ చైనాలోని వూహాన్‌లో పుట్టిందని చెప్పలేమని అన్నారు. దీంతో ఆ కథ సద్దుమణిగింది. కట్ చేస్తే.. చైనాలో ఇప్పుడు కరోనా భయం లేదు. జనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
గతేడాది ఇదే సమయంలో చైనాలో కఠిన లాక్ డౌన్‌ను అమలు చేశారు. అనేక దేశాల్లో గతేడాది ఇదే సమయంలో కరోనా విలయ తాండవం చేసింది. అయితే ఆయా దేశాల్లో కరోనా సెకండ్, థర్డ్ వేవ్‌లు కూడా అయిపోయాయి. కరోనా భయం లేదు. చైనాలో అయితే కోవిడ్ భయం పూర్తిగా పోయింది. వారు కోవిడ్ ను ఎలా కట్టడి చేశారు, అంత తక్కువగా కేసులు ఎలా నమోదు అయ్యాయి ? అనేది ఇప్పటికీ మిస్టరీనే. కానీ ప్రస్తుతం చైనాలో పౌరులు కోవిడ్ భయం లేకుండా పార్టీలు చేసుకుంటున్నారు.
వూహాన్‌లో తాజాగా నిర్వహించిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌కు ఏకంగా 11వేల మంది హాజరయ్యారు. అలాగే పలు ఇతర చోట్ల కూడా ఇలాంటి కల్చరల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కానీ భారత్‌తోపాటు ఇంకా కొన్ని దేశాలు ఇప్పటికీ కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. మరి మన దగ్గర ఎప్పుడు కోవిడ్ భూతం అంతమవుతుందో చూడాలి.