ఐరోపాలో వేడి విపరీతంగా పెరిగిపోతోంది. వేడి గాలుల వల్ల ఈ ఏడాదిలో 15వేల మంది ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. స్పెయిన్, పోర్చుగల్‌లో సుమారు 4వేల మంది, యూకేలో వెయ్యికిపైగా, బ్రిటన్‌లో 3,200, జర్మనీలో 4,500 మందికిపై మరణాలు నమోదయ్యాయని యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ హన్స్ హెన్రీ క్లూగే తెలిపారు. పలు దేశాల్లో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
ప్రపంచ వాతావరణ సంస్థ ఈ వారం విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యంత వేగంగా వేడెక్కుతున్న ప్రాంతం ఐరోపానే. ఈ ప్రాంతంలో గత 50 ఏళ్లుగా విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా 1.48లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ హన్స్ హెన్రీ పేర్కొన్నారు. ఒక్క ఈ ఏడాదిలో కనీసం 15వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
మరో వైపు వాతావరణ మార్పు సంఘటనలతో వందలాది మరణాలు నమోదవుతుండగా అర మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు నేరుగా ప్రభావితమయ్యారని చెప్పారు. ఈ ఘటనలో 84 శాతం వరదలు, తుపానులు కారణమని వెల్లడించారు. మారుతున్న వాతావరణ మార్పుల దృష్ట్యా, భవిష్యత్తు గురించి మనం అప్రమత్తంగా ఉండాలని ఇది ఒక సంకేతమని పేర్కొన్నారు.