గతంలో చాలా మంది రూ.5 నోట్లను తీసుకునేందుకు నిరాకరించారు. తరువాత రూ.10 నాణేలను తీసుకోవడం మానేశారు. అయితే ఆర్‌బీఐ అనేక సార్లు ఈ విషయాలపై స్పష్టతను ఇచ్చింది. ఆయా నోట్లు, కాయిన్లు చెల్లుతాయని, తీసుకోకపోతే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని చోట్ల రూ.5 నోట్లతోపాటు రూ.10 నాణేలను తీసుకోవడం లేదు. అయితే ఆర్‌బీఐ ఇటీవలే అందుబాటులోకి తెచ్చిన కొత్త రూ.20 నాణేలకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది.
ఆర్‌బీఐ గతేడాది లాక్‌డౌన్ కన్నా ముందే కొత్త రూ.20 నాణేలను ముద్రించింది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, నోయిడాలలో ఉన్న ముద్రణా కేంద్రాల్లో ఆ నాణేలను ముద్రించారు. అయితే అప్పట్లోనే వీటిని చెలామణీలోకి తెద్దామని భావించారు. కానీ లాక్‌డౌన్ వల్ల వీలు కాలేదు. అయితే వీటిని తాజాగా చెలామణీ చేస్తున్నారు. కానీ కొందరు రూ.20 నాణేలను తీసుకోవడం లేదు.
గతంలో రూ.5 నోట్లు, తరువాత రూ.10 నాణేల లాగే ఇప్పుడు రూ.20 నాణేలను ఎవరూ తీసుకోవడం లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని అందులో వ్యాప్తి చెందుతున్న వదంతుల కారణంగా కూడా కొందరు రూ.20 నాణేలను తీసుకోవడం లేదు. ఇక చిత్రమైన విషయం ఏమిటంటే.. కొన్ని బ్యాంకుల్లోనూ ఈ నాణేలను తీసుకోవడం లేదని తెలిసింది. అయితే దీనిపై ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది. కొత్త రూ.20 నాణేలను తీసుకోవాల్సిందేనని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ఈ నాణేలను తీసుకుంటారా, లేదా.. అన్నది తేలాల్సి ఉంది. చాలా మంది ఈ నాణేలను నకిలీ అని భావిస్తుండడం వల్ల కూడా వీటిని తీసుకోవడం లేదని తెలిసింది.